24 Mar 2013

వేసవికాలం సెలవలు



అది నేను చాలా చిన్నప్పుడు. అది వేసవి కాలం. ఎంతో ఇష్టమైన కాలం. ఎంచక్కా స్కూల్ కి వెళ్ళే పని లేకుండా, ఆడుకోవచ్చు కదా. అసలే నాకు మా సోషల్ మాష్టారు అంటే అస్సలు ఇష్టం లేదు. ఏవేవో ఊరి పేర్లు ఇచ్చి ఎక్కడున్నాయో గుర్తుపెట్టమంటాడు. అది వేరే కథ. మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు మనం వేసవి కాలం సెలవలకు వచ్చేద్దాం. నేను, మా తమ్ముడు కలసి గేదెలను మేపడానికి మామిడి తోటలోకి తోలుకేళ్లేవాళ్ళం. ఊరికే వెళ్తామా ఏంటి? మా అమ్మని పీడించుకుని నాకు అది కావాలి, ఇది కావాలి అని పెద్ద లిస్ట్ ఇచ్చి, ఇవన్నీ ఇస్తే గాని వెళ్ళేవాళ్లం కాదు, వీటితో పాటు మంచినీళ్లు కూడా. అసలే ఎండాకాలం, మంచినీళ్లు లేకపోతే ఎలా చెప్పండి? అంతేకాకుండా మంచినీళ్లు కావాలంటే చెరువుకు వచ్చి తీసుకెళ్లాలి, అక్కడి తోటల్లో దొరకావు కూడాను. ఇంతా చేసి మేమేదో గొప్ప పని చేస్తామనుకునేరు? గేదెలకు దారి తెలుసు, వదిలేస్తే అవే మా తోటలోకి వెళ్ళేవి. మేము చేయాల్సిందల్లా అవి పక్క తోటలోకి వెళ్లకుండా కాపలా కాయలి అంతే. మేము ఎంచక్కా తోటలో కూర్చుని తెచ్చుకున్నవి తింటూ ఉండేవాళ్లం.
ఒకసారి ఏమైందంటే,
ఎవరో ఒకాయన వచ్చి “గొంతు ఎండుకుపోతుంది కాసిని మంచినీళ్లు ఇవ్వమ్మా” అన్నాడు.
మేము ఏమన్నా పిచ్చివాళ్ళమా ఇవ్వడానికి? “మేము ఇవ్వం” అని చెప్పాం.
ఆయనేమో “కొంచెం పుణ్యం ఉంటుంది, కాసిని నీళ్ళు ఇవ్వండమ్మా” అన్నాడు.
మేము మాత్రం, “మాకు పుణ్యం వద్దు, ఏమీ వద్దు, మేము ఇవ్వం” అన్నాం.
పాపం ఆయనకు బాగా దాహం వేస్తుందేమో? “చచ్చి మీ కడుపున పుడతా, కాసిని మంచినీళ్లు ఇవ్వండమ్మా” అని బతిమాలాడు.
అయినా మేము కొంచెం కూడ కరగలేదు. మమ్మల్ని చిన్నపిల్లల్ని చేసి మా దగ్గర ఉన్న నీళ్ళు అన్నీ తాగేస్తే, మళ్ళీ బొల్డు దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకే “నువ్వు ఏమి మా కడుపున పుట్టక్కర్లేదు, మేము నీళ్ళు ఇవ్వం” అని చెప్పేశాం.
ఆయనేమో బొల్దంత బాధపడి, “ఏమి పిల్లలమ్మా మీరు? ప్రాణం పోతున్నా చుక్క నీళ్ళు కూడా ఇవ్వరు?” అని వెళ్లిపోయాడు.
మీరే చెప్పండి. నేను చేసింది తప్పా???
P.S: నేను చేసింది తప్పని చెప్పారో, మీకు కూడా మంచినీళ్లు ఇవ్వను. ముందే చెప్తున్నా. జాగ్రత్త!!!