11 Jan 2014

ఒక రాత్రి

అది ఎనిమిదో తరగతి చదివే రోజులు. ఏడవ తరగతి లో పే....ద్ద పొడిచేశామని (అదే చదివేశామని) మనం అల్లరి చేసినా పట్టించుకొని రోజులు. కానీ మనమేమో రాత్రి కూడా చదువుకోవాలని ఫోజు కొట్టి రాత్రి చదువు గంటలు (night study hours) కి వెళ్ళి చదరంగం, క్యారమ్స్ ఆడుకునేవాళ్లం. ఆరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల దాకా చదువుకుని (ఆడుకుని) ఇంటికి వెళ్తున్నాను.
మామూలుగా నేను చాలా ధైర్యవంతుడినే(భయపడినప్పుడు తప్ప), మా ఊళ్ళో దారులు అన్నీ బాగానే ఉంటాయి గానీ, అదేంటో నేను వెళ్ళే దారిలోనే లైట్స్ ఉండవు.
అందులోనూ ఆ పాడుపడిపోయిన ఇంటి దగ్గర ఉన్న మలుపు దగ్గర చిమ్మ చీకటిగా ఉంటుంది.
అక్కడదాకా పాటలు పాడుతూ వచ్చే నాకు, అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ దయ్యం పాటలే గుర్తుకు వచ్చేవి.
దానికి తోడు అక్కడ ఉన్న చెట్టు ఒకటి, నాకంటే ఎత్తుగా, నల్లగా ఉండేది (చీకటి కదా!).
నేనేమో జాగ్రత్తగా పాదాల చప్పుడు కూడా వినపడకుండా దొంగ లాగా వెళ్ళేవాడిని.
ఆరోజు కూడా అలాగే వెళ్తున్నా కానీ ఎక్కడో చిన్నగా శబ్దం వినపడింది. అంతే ఒక్కసారిగా ఆగిపోయా.
నిదానంగా తల తిప్పి చూసా,
ఆ నల్లటి చెట్టు కింద తెల్లగా ఏదో ఉంది. ఒక్కసారిగా పైకి లేచింది, అంతే!!!
మరుక్షణం నేను అక్కడ లేను, ఒలంపిక్ రన్నర్ లాగా పరుగో పరుగు.
ఐదు నిమిషాల్లో పట్టే దూరం, అర నిమిషంలో వెళ్లి దుప్పటి ముసుగు పెట్టి పడుకుండిపోయా.
తెల్లారిన తర్వాత మళ్ళీ నా ధైర్యం నా దగ్గరకు వచ్చేసింది. ఎప్పటిలాగే స్కూల్ కి వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తే తెల్ల కాగితం మాత్రమే ఉంది, అదే రాత్రి గాలికి ఎగిరింది. నా ధైర్యమేమో ఎగిరిపోయింది, నేనేమో పారిపోయాను. అందుకేనండీ మనం భయపడకూడదు, కుదిరితే మనమే భయపెట్టాలి.

P.S: భయో రక్షతి రక్షితః. అంతే మనం భయాన్ని రక్షించితే, భయమే మనల్ని రక్షిస్తుందని అర్ధం.