4 Mar 2016

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ - నువ్వంటే నా నవ్వు song lyrics

Krishna Gadi Veera Prema Gaadha Song Lyrics

ఈ సినిమా లోని అన్ని పాటలలో కెల్లా నాకు ఎంతో ఇష్టమైన పాట నువ్వంటే నా నవ్వు. (Nuvvante Na Navvu)

Music Composer      : Vishal Chandrasekhar
Lyric writer              : Krishnakanth
Singer                         : Haricharan, Sinduri Vishal

నువ్వంటే నా నవ్వు 
నేనంటే నే నువ్వు 
నువ్వంటూ నేనంటూ లేమనీ 

అవునంటూ మాటివ్వు 
నిజమంటూ నే  నువ్వు 
నే రాని దూరాల్ని నువ్ పోనని 

ఎటు ఉన్నా నీ నడక 
వస్తాగా నీ  వెనక 
దగ్గరగా రానీను దూరమే 

నే వేసే ప్రతి అడుగు 
ఎక్కడికో నువ్ అడుగు 
నిలుచున్నా నీ వైపే చేరేనులే 


నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
నీ చూపేమో సడిలేని ఉరుమయినదే
నువ్వు ఆకాశం నేను నీకోసం
తడిసిపోదామా ఈ వానలో

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా.   [ఈ చినుకు]

నే ఇటు వస్తాననుకోలేదా
తలుపస్సలు తీయవు తడితే
పో పసివాడని జాలే పడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేసావే
నువ్వూ నేనంటూ పలికే పదముల్లో
అధరాలు తగిలేనా  కలిసే వున్నా
మనమంటూ  పాడు పెదవుల్లో చూడు
క్షణమైనా విడిపోవులే
ఇది ఓ వేదం పద రుజువవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసినా


నువ్  నవ్వేటి కోపానివే
మనసతికిన ఓ రాయివే 
నువ్ కలిసొచ్చే శాపానివే 
నీరల్లే మారేటి రూపానివే 
నచ్చే  దారుల్లో నడిచే నదులైనా 
కాదన్నా కలవాలి సంద్రములోన 
విడివిడిగా వున్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే 
వొద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ 
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా

6 Apr 2014

తెలుగు సామెతలు (సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు)

సామెత అనే మాట సామ్యత (పోలిక) నుంచి వచ్చింది. సామెతలకి ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ఇవి ముఖ్యంగా నీతి, అనుభవం, సూచనలతో పాటు హాస్యం కలగలిసి ఉంటాయి. ఇవి ప్రజల అనుభవాల్లో నుంచి పుట్టుకొస్తాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబిబిస్తాయి. ఇవి కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటాయి. అలంకాపూరికి రాజైతే మాత్రం అతిగా ఖర్చు చేస్తాడా....?’ అని రాజుల కాలం నుంచి పూలన్ దేవి పుణ్యానికి పోతే వీరప్పన్ మనకెందుకే అని వారించాడట... లాగా ఇప్పటి వరకు పుట్టుకొస్తూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇవి అప్పటి అవతలి వారికి కనువిప్పు కలిగించేవిగా ఉంటాయి. సంక్షిప్తంగా ఉండడం వీటి ప్రత్యేకత. 20 పదాల కంటే పెద్దగా ఉంటే అవి సామెతలు కాదని పండితుల అభిప్రాయం. 

సామెతలు ప్రసంగాలు, సంభాషణలకు మెరుపులద్దుతాయి.  సందస్భానుసారంగా సామెతలు వాడటం ఒక కళ. సామెతలు విజ్ఞాన సంపదతో పాటు హాస్య రసం కూడా ఉండడం వల్ల శ్రోతలు ఆనందానుభూతులు పొందుతారు.  అందుకే సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’. ఆమెత అంటే విందు భోజనం అని అర్దం. ఎంతటి అర్దవంతమైన విషయమైనా సామెతలతో కలిపి చెప్పడం వల్ల వినసొంపుగా ఉంటుంది. సామెతలు లేకుండా సాదాసీదాగా సాగే ప్రసంగం విందులు విలాసాలు లేని ఇల్లు లాంటిదని తెలుగు సామెత ప్రియుల దృఢ విశ్వాసం.
ఇప్పుడు తెలుగు మాట్లాడడానికే ఇష్టపడటం లేదు, ఇంక సామెతల గుంరించి ఏమి తెలుస్తుంది. అలాంటి వాళ్ళను చూసే చెవిటివాడి ముందు శంఖం ఊడినట్లు’, గాడిదకేమి తెలుసు గందపు చెక్కల వాసన లాంటి సామెతలు పుట్టుకొచ్చాయి. మన తెలుగు భాష మాధుర్యాన్ని ఇనుమడింపచేసే సామెతలనీ e-తరం వాళ్ళకి తెలియచెప్పాలనే ప్రయత్నంతో ముఖచిత్రంలో (facebook) తెలుగు సామెతలు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఈ పేజ్ కి లైక్ కొట్టి మన సామెతలను ప్రపంచం నలుమూలలకు చాటిచెప్పండి.  మా ఈ ప్రయత్నానికి మీ సహాయ సహకారాలను బ్లాగు ముఖంగా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన సామెతలను నాకు పంపవలసిందిగా ప్రార్దన.   

P.S: సామెతలు ఎక్కడ వాడినా వాడకున్నా మన న్యూస్ చానల్స్ వాళ్ళు మాత్రం విరివిరిగా వాడి అందులో వార్త కన్నా మసాలా ఎక్కువుండేలా చూస్తున్నారు, ఇదేమైనా బాగుందా? మీరే చెప్పండి. 

11 Jan 2014

ఒక రాత్రి

అది ఎనిమిదో తరగతి చదివే రోజులు. ఏడవ తరగతి లో పే....ద్ద పొడిచేశామని (అదే చదివేశామని) మనం అల్లరి చేసినా పట్టించుకొని రోజులు. కానీ మనమేమో రాత్రి కూడా చదువుకోవాలని ఫోజు కొట్టి రాత్రి చదువు గంటలు (night study hours) కి వెళ్ళి చదరంగం, క్యారమ్స్ ఆడుకునేవాళ్లం. ఆరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల దాకా చదువుకుని (ఆడుకుని) ఇంటికి వెళ్తున్నాను.
మామూలుగా నేను చాలా ధైర్యవంతుడినే(భయపడినప్పుడు తప్ప), మా ఊళ్ళో దారులు అన్నీ బాగానే ఉంటాయి గానీ, అదేంటో నేను వెళ్ళే దారిలోనే లైట్స్ ఉండవు.
అందులోనూ ఆ పాడుపడిపోయిన ఇంటి దగ్గర ఉన్న మలుపు దగ్గర చిమ్మ చీకటిగా ఉంటుంది.
అక్కడదాకా పాటలు పాడుతూ వచ్చే నాకు, అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ దయ్యం పాటలే గుర్తుకు వచ్చేవి.
దానికి తోడు అక్కడ ఉన్న చెట్టు ఒకటి, నాకంటే ఎత్తుగా, నల్లగా ఉండేది (చీకటి కదా!).
నేనేమో జాగ్రత్తగా పాదాల చప్పుడు కూడా వినపడకుండా దొంగ లాగా వెళ్ళేవాడిని.
ఆరోజు కూడా అలాగే వెళ్తున్నా కానీ ఎక్కడో చిన్నగా శబ్దం వినపడింది. అంతే ఒక్కసారిగా ఆగిపోయా.
నిదానంగా తల తిప్పి చూసా,
ఆ నల్లటి చెట్టు కింద తెల్లగా ఏదో ఉంది. ఒక్కసారిగా పైకి లేచింది, అంతే!!!
మరుక్షణం నేను అక్కడ లేను, ఒలంపిక్ రన్నర్ లాగా పరుగో పరుగు.
ఐదు నిమిషాల్లో పట్టే దూరం, అర నిమిషంలో వెళ్లి దుప్పటి ముసుగు పెట్టి పడుకుండిపోయా.
తెల్లారిన తర్వాత మళ్ళీ నా ధైర్యం నా దగ్గరకు వచ్చేసింది. ఎప్పటిలాగే స్కూల్ కి వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తే తెల్ల కాగితం మాత్రమే ఉంది, అదే రాత్రి గాలికి ఎగిరింది. నా ధైర్యమేమో ఎగిరిపోయింది, నేనేమో పారిపోయాను. అందుకేనండీ మనం భయపడకూడదు, కుదిరితే మనమే భయపెట్టాలి.

P.S: భయో రక్షతి రక్షితః. అంతే మనం భయాన్ని రక్షించితే, భయమే మనల్ని రక్షిస్తుందని అర్ధం.