25 Apr 2013

కలలు


కల అంటే నిజం కానిది అని అర్దం. కల రావాలంటే నిద్ర పోవాలంతే (పగటి కలలు వేరే లెండి). మనకేమో ఎంచక్కా పగలేమో గాల్లో తెలినట్టుందే అంటూ ఊహల్లో తేలుతూ, రాత్రేమో ఆరుబయట పండు వెన్నెల్లో చందమామని, చుక్కల్ని(ఆకాశంలో చుక్కలండి, నేనసలే చాలా మంచివాడిని ) చూస్తూ నిద్రపోతే కాలల్లోకి కూడా అవే వస్తాయి కదా!!! పగలు ఎంత హైరానా పడ్డా రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలి. అదేంటో కలలు రాకుండా నిద్ర పోతేనే మంచి నిద్ర అంటారు, నాకు మాత్రం మంచి మంచి కలలు వస్తేనే బావుంటుంది. ఎంచక్కా రెక్కల గుర్రం ఎక్కి నక్షత్రాల మధ్యలోంచి ఎగురుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది? మన కలల లోకంలో మనమే హీరో/హీరోయిన్. మనకి నచ్చినట్టు మనం చేయచ్చు, అంతా మన మనసు ఆధీనంలో ఉంటుంది. మనం ఒక కారులో వెళ్తున్నాం అనుకోండి, అది ఆగిపోవాలి అనుకుంటే ఆగిపోతుంది, వెళ్ళాలి అనుకుంటే వెళ్తుంది. మనకి కారు ఇంజిన్ సరిపోదు అనుకుంటే కారుకే విమానం ఇంజిన్ పెట్టేద్దాం. అంతా మన ఇష్టం కదా.
అంచేత ఇందుమూలముగా మీకు చెప్పొచ్చేదేమంటే మీరు కూడా మీకు ఇష్టమైన కలల లోకంలో విహరించండి.  

16 Apr 2013

నాకు ఇష్టమైన డైలాగ్

నేను మొన్న ఒక లఘుచిత్రం చూశాను. చాలా బాగుంది. అందులో ఒక డైలాగ్ బాగా నచ్చేసింది. అది మీకోసం. 


"నువ్వు నా life లో ఉండవనే నిజాన్ని తెలిసాక, నేను నీ చుట్టూ తిరగలేను. మనకి నచ్చని విషయాలు కళ్ళు మూసుకుని చూడకుండా ఉండొచ్చు, కానీ మనకి నచ్చిన feelings ఏంచేసినా వెంటాడుతూనే ఉంటాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది."

లఘుచిత్రమ్ లంకె: 


24 Mar 2013

వేసవికాలం సెలవలు



అది నేను చాలా చిన్నప్పుడు. అది వేసవి కాలం. ఎంతో ఇష్టమైన కాలం. ఎంచక్కా స్కూల్ కి వెళ్ళే పని లేకుండా, ఆడుకోవచ్చు కదా. అసలే నాకు మా సోషల్ మాష్టారు అంటే అస్సలు ఇష్టం లేదు. ఏవేవో ఊరి పేర్లు ఇచ్చి ఎక్కడున్నాయో గుర్తుపెట్టమంటాడు. అది వేరే కథ. మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు మనం వేసవి కాలం సెలవలకు వచ్చేద్దాం. నేను, మా తమ్ముడు కలసి గేదెలను మేపడానికి మామిడి తోటలోకి తోలుకేళ్లేవాళ్ళం. ఊరికే వెళ్తామా ఏంటి? మా అమ్మని పీడించుకుని నాకు అది కావాలి, ఇది కావాలి అని పెద్ద లిస్ట్ ఇచ్చి, ఇవన్నీ ఇస్తే గాని వెళ్ళేవాళ్లం కాదు, వీటితో పాటు మంచినీళ్లు కూడా. అసలే ఎండాకాలం, మంచినీళ్లు లేకపోతే ఎలా చెప్పండి? అంతేకాకుండా మంచినీళ్లు కావాలంటే చెరువుకు వచ్చి తీసుకెళ్లాలి, అక్కడి తోటల్లో దొరకావు కూడాను. ఇంతా చేసి మేమేదో గొప్ప పని చేస్తామనుకునేరు? గేదెలకు దారి తెలుసు, వదిలేస్తే అవే మా తోటలోకి వెళ్ళేవి. మేము చేయాల్సిందల్లా అవి పక్క తోటలోకి వెళ్లకుండా కాపలా కాయలి అంతే. మేము ఎంచక్కా తోటలో కూర్చుని తెచ్చుకున్నవి తింటూ ఉండేవాళ్లం.
ఒకసారి ఏమైందంటే,
ఎవరో ఒకాయన వచ్చి “గొంతు ఎండుకుపోతుంది కాసిని మంచినీళ్లు ఇవ్వమ్మా” అన్నాడు.
మేము ఏమన్నా పిచ్చివాళ్ళమా ఇవ్వడానికి? “మేము ఇవ్వం” అని చెప్పాం.
ఆయనేమో “కొంచెం పుణ్యం ఉంటుంది, కాసిని నీళ్ళు ఇవ్వండమ్మా” అన్నాడు.
మేము మాత్రం, “మాకు పుణ్యం వద్దు, ఏమీ వద్దు, మేము ఇవ్వం” అన్నాం.
పాపం ఆయనకు బాగా దాహం వేస్తుందేమో? “చచ్చి మీ కడుపున పుడతా, కాసిని మంచినీళ్లు ఇవ్వండమ్మా” అని బతిమాలాడు.
అయినా మేము కొంచెం కూడ కరగలేదు. మమ్మల్ని చిన్నపిల్లల్ని చేసి మా దగ్గర ఉన్న నీళ్ళు అన్నీ తాగేస్తే, మళ్ళీ బొల్డు దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకే “నువ్వు ఏమి మా కడుపున పుట్టక్కర్లేదు, మేము నీళ్ళు ఇవ్వం” అని చెప్పేశాం.
ఆయనేమో బొల్దంత బాధపడి, “ఏమి పిల్లలమ్మా మీరు? ప్రాణం పోతున్నా చుక్క నీళ్ళు కూడా ఇవ్వరు?” అని వెళ్లిపోయాడు.
మీరే చెప్పండి. నేను చేసింది తప్పా???
P.S: నేను చేసింది తప్పని చెప్పారో, మీకు కూడా మంచినీళ్లు ఇవ్వను. ముందే చెప్తున్నా. జాగ్రత్త!!!